ఇళ్ల నిర్మాణ బిల్లుల చెల్లింపునకు ఇద్దరు లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్న గృహ నిర్మాణ సంస్థ ఏఈకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనందుకు ఫిర్యాదుదారుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు కథనం ప్రకారం..
తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కె. సావరం గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగలక్ష్మి, సుంకర దైవకృప గతంలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇళ్లు నిర్మించుకున్నారు. 2009లో వాటి బిల్లుల చెల్లింపునకు అప్పటి ఉండ్రాజవరం మండల గృహ నిర్మాణ సంస్థ ఏఈ యలమంచిలి ప్రకాశరావు ఒక్కొక్కరి నుంచి రూ.3 వేల చొప్పున లంచం డిమాండ్ చేశాడు.
దీంతో లబ్ధిదారుల తరపున అదే గ్రామానికి చెందిన బస్వా నాగ వెంకట గణేశ్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఇంజినీర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. అయితే, కేసు తుది విచారణలో గణేశ్ సరిగ్గా సాక్ష్యం చెప్పకపోవడంతో లంచం తీసుకున్న ప్రకాశరావుపై కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
ఇదే క్రమంలో గణేశ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. రాజమండ్రి ఏసీబీ కోర్టులో తుది విచారణ జరిపిన సందర్భంలో గణేశ్‌పై నేరం నిరూపణ కావడంతో నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.