తెలంగాణ గ్రూప్-1 నియామక ప్రక్రియలో నెలకొన్న వివాదంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం, తుది తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమ జవాబు పత్రాలను రీ-వాల్యుయేషన్ చేయాలని వారు పిటిషన్లో కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, గ్రూప్-1 పరీక్షలను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
గతంలో ఈ నియామకాలపై జస్టిస్ రాజేశ్వరరావు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన ధర్మాసనం, తదుపరి తీర్పును వెల్లడించేంత వరకు రిజర్వ్‌లో ఉంచింది.