అసలు కావొచ్చు.. కొసరు కావొచ్చు. ఆమె ఆషామాషీ ఫ్యామిలీ నుంచి రాలేదు. తన సవతి తండ్రి కర్ణాటక డీజీపీ (లా అండ్ ఆర్డర్ కాదునుకోండి).. ఆమె ఏమైనా సాదాసీదా వ్యక్తి కూడా కాదు. కన్నడ బుల్లితెర నటిగా సుపరిచితురాలు. సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నారు రన్యరావు. అలాంటి ఆమె తాజాగా దుబాయ్ నుంచి వస్తున్న వేళ.. అధికారులు ఆమెను తనిఖీ చేయగా.. ఆమె నుంచి ఏకంగా 14 కేజీల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్నట్లుగా గుర్తించటం తెలిసిందే. ఆమె వ్యవహారం పెను సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఆమె చేసే బంగారం స్మగ్లింగ్ కు సంబంధించి తాజాగా వెలుగు చూస్తున్న అంశాలు సంచలనంగా మాత్రమే కాదు.. షాకిచ్చేలా ఉన్నాయి. తన తండ్రి పేరు చెప్పుకొని.. ఎయిర్ పోర్టులో ఒక కానిస్టేబుల్ ను సెట్ చేసుకొని దర్జాగా బంగారాన్ని స్మగుల్డ్ చేసేవారన్న విషయాన్ని గుర్తించారు. ఏడాది వ్యవధిలో ఆమె ఏకంగా 30 సార్లు దుబాయ్ కు వెళ్లటం చూస్తే ఆమె ఎంత భారీగా బంగారాన్ని స్మగ్లింగ్ చేశారో అర్థమవుతుంది. ఇంతకూ ఒక్కో ట్రిప్ నకు ఆమెకు మిగిలేదెంత? ఎంత బంగారాన్ని తీసుకొస్తుంటారు? అన్న విషయాన్ని అధికారులు లోతుగా విచారించిన సందర్భంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. ప్రతి ట్రిప్ నకు కనీసం పది కేజీలకు తగ్గకుండా బంగారాన్ని తీసుకొచ్చేవారిన చెబుతున్నారు. దీని కోసం ప్రత్యేకమైన జాకెట్ ను.. బెల్ట్ ను ఉపయోగించే వారని చెబుతున్నారు. ఇక.. ఎయిర్ పోర్టులో తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ ను సెట్ చేసుకున్న ఆమెపై ఎయిర్ పోర్టు అధికారులకు అనుమానం రావటంతో ఆమె పాపం పండింది