ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ భారత్, న్యూజిలాండ్ జట్లు ఆడుతున్నాయి. టోర్నీలో ఇదే చివరి లీగ్ మ్యాచ్. గ్రూప్-ఏలో భాగంగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు మాత్రమే చేసింది. శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ చేయగా… అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నారు. కివీస్ పేసర్ మాట్ హెన్రీ 5 వికెట్లతో రాణించాడు.
భారత్ కు ఈ మ్యాచ్ లో శుభారంభం దక్కలేదు. కివీస్ పేసర్ల ధాటికి 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్ మన్ గిల్ (2), విరాట్ కోహ్లీ (11) పరుగులు చేశారు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ జోడీ ఆదుకుంది. అయ్యర్ 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 79 పరుగులు చేయగా… అక్షర్ పటేల్ 61 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 42 పరుగులు చేశాడు.
హార్దిక్ పాండ్యా (45), కేఎల్ రాహుల్ (23) కూడా ఫర్వాలేదనిపించడంతో టీమిండియా స్కోరు 200 మార్కు దాటింది. జడేజా 16 పరుగులు చేశాడు. దుబాయ్ స్టేడియంలో ఈ మ్యాచ్ కు స్లో పిచ్ ను ఉపయోగించడంతో పరుగులు చేసేందుకు బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు. మరి, టీమిండియా బౌలింగ్ దాడులను తట్టుకుని కివీస్ బ్యాట్స్ మెన్ ఎలా ఆడతారో చూడాలి