ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిపోవడం గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం సొరంగంలో నీటి తొలగింపు పనులు చేపట్టి ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగేది కాదని ఆయన అన్నారు. ఎస్ఎల్‌బీసీ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయన, రెండు రోజుల్లో సహాయక చర్యలను పూర్తి చేస్తామని తెలిపారు.
రెండు నెలల్లో తిరిగి సొరంగం తవ్వకాల పనులు చేపడతామని వెల్లడించారు. గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలు తీసుకునే ప్రాజెక్టును పక్కన పెట్టారని, ఈ టన్నెల్‌ను పూర్తి చేసి ఉంటే 4.50 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవని ఆయన అన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టులన్నీ వాళ్ల జేబులను నింపుకోవడానికేనని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును కడితే అది మూడేళ్లకే కూలిపోయిందని అన్నారు.
గతంలో శ్రీశైలం పవర్ ప్లాంటులో అగ్ని ప్రమాదం జరిగి ఆరుగురు ఉద్యోగులు మృత్యువాత పడితే కేసీఆర్ వెళ్లి చూడలేదని విమర్శించారు. పాలమూరు పంప్‌హౌస్‌లో ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆరుగురు చనిపోయారని, అప్పుడూ స్పందించలేదని అన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది భక్తులు చనిపోతే కేసీఆర్ వెళ్లలేదని విమర్శించారు. మాసాయిపేట రైలు ప్రమాదంలో చిన్నారులు చనిపోయినప్పుడు కూడా ఆయన పరామర్శించలేదని పేర్కొన్నారు.
కానీ, ఇప్పుడు మాత్రం హరీశ్ రావు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి రాజకీయం చేయాలని చూశారని ధ్వజమెత్తారు. హరీశ్ రావుకు అనుభవం ఉంటే పదేళ్లలో ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సొరంగంలో నిపుణుల చర్యలకు ఇబ్బంది కాకూడదని అందరినీ లోనికి పంపించడం లేదని వెల్లడించారు. బురద తొలగింపు పనులు జరుగుతున్నట్లు చెప్పారు.