బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర ఈరోజు రూ.350 పెరిగి రూ.89,100 పలికింది. వెండి కిలో లక్ష రూపాయలు పలుకుతోంది. శుక్రవారం నాడు బంగారం ధర రూ.88,750 వద్ద ముగియగా, ఈరోజు రూ.89 వేలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్ 2,954.71 డాలర్లు పలికింది. స్పాట్ గోల్డ్ 5.50 డాలర్లు పెరిగి ఔన్స్ 2,941.55 డాలర్లకు చేరుకుంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,550 పలుకగా, 24 క్యారెట్ల పసిడి రూ.87,870 పలికింది. భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ.1.08 లక్షలు పలికింది.
వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు వేయడం, వాణిజ్య యుద్ధాల భయాల ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్‌పై కనిపిస్తోంది. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు చూస్తున్నారు. అందుకే పసిడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి బలహీనపడటం వలన కూడా మన వద్ద బంగారం ధరకు అదనపు మద్దతు లభించిందని నిపుణులు చెబుతున్నారు.