గత కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే స్టాక్ మార్కెట్లతో పాటు పెట్టుబడిదారులు కూడా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూశారని చెప్పొచ్చు. ఫెడ్ వడ్డీ రేట్లపై ప్రకటనతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై, బంగారం ధరలపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట పెడచెవిన పెట్టిన ఫెడ్ వడ్డీ రేట్లను ఈసారి స్థిరంగా ఉంచింది. అయినప్పటికీ బంగారం ధరలు భారీగా పెరిగాయి.2020 తర్వాత తొలిసారిగా ఫెడ్ వడ్డీ రేట్లను దాదాపు నాలుగేళ్ల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 4.75-5.0 శాతానికి చేర్చింది. అంతకుముందు ఇది 5.25- 5.50 శాతం రేంజ్లో ఉండేది. 22 ఏళ్ల గరిష్ట స్థాయి నుంచి ఒక్కసారిగా తగ్గించింది. ఆ తర్వాత కూడా మళ్లీ రెండు వరుస సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించింది ఫెడ్. 2025లోనూ వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని గతంలో ప్రకటించిన ఫెడ్.. ఈసారి యథాతథంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ మార్కెట్ పరిస్థితులు బలంగా ఉన్నాయని.. ద్రవ్యోల్బణమే లక్ష్యం కంటే కాస్త ఎక్కువగా ఉందని తెలిపింది ఫెడ్.
అయితే ఫెడ్ ప్రకటన తర్వాత స్పందించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ .. ఫెడ్ వైఖరి సహా ఛైర్మన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ఫెడ్ సరైన వైఖరి అవలంబించట్లేదని ఆరోపించారు. ద్రవ్యోల్బణంతో వారు సృష్టించిన సమస్యను పరిష్కరించడంలో ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్, ఫెడ్ విఫలం అవుతూ వస్తుందని, అనవసర విషయాలపై దృష్టి సారిస్తోందని అన్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.