పూల పండుగతో పల్లెలో సందడి.. మహిళల ఆటపాటలతో కోలాహలం
చేవెళ్ల ప్రజాజ్యోతి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన మహిళలు, యువతులు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కేరింతలు, జానపద గీతాలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.
గ్రామ సర్పంచ్ ముండ్రిక పద్మ, కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో బతుకమ్మ వంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
