కోడంగల్‌లో నూతన పోలీస్ భవనాల నిర్మాణ పనుల పరిశీలన..
త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశం

కోడంగల్, సెప్టెంబర్ 23 (ప్రజాజ్యోతి): వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ బుధవారం కోడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యటించి, నిర్మాణంలో ఉన్న నూతన కోడంగల్ పోలీస్ స్టేషన్ భవనం అలాగే సీఐ కార్యాలయ నూతన భవనం పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా భవనాల నిర్మాణ పురోగతి, పోలీస్ సిబ్బందికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందుబాటులో ఉండే సేవల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనాల నిర్మాణం పూర్తయిన అనంతరం ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు, ఆధునిక సౌకర్యాలతో కార్యాలయాలను తీర్చిదిద్దాలని అధికారులకు ఎస్పీ సూచించారు. అలాగే నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అన్ని పనులను సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించిన ఎస్పీ, నిర్మాణ పనుల ప్రస్తుత స్థితి, పూర్తయిన పనులు, చేపట్టాల్సిన తదుపరి పనులపై అధికారుల నుంచి వివరాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కోడంగల్ సీఐ చంద్రకాంత్ రెడ్డి, కోడంగల్ ఎస్‌ఐ సత్యనారాయణతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
