భక్తులకు మహాన్నదానం.. ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

లాడేగావ్‌లో శివ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ
భారీగా తరలివచ్చిన భక్తులు.. భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న ఉత్సవాలు
జుక్కల్, సెప్టెంబర్ 20 (ప్రజాజ్యోతి):
జుక్కల్ మండలంలోని లాడేగావ్ గ్రామంలో శివ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండలి సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ రాజశేఖర పటేల్ అశ్విని, పెరిశెట్టి సహదేవ్–సవిత దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు మహాన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. గ్రామంలోని వివిధ వాడల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులతో సందడిగా లాడేగావ్..!
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లాడేగావ్ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గణేష్ మండలి సభ్యులు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహాన్నదాన కార్యక్రమాన్ని క్రమబద్ధంగా నిర్వహించారు.
ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని మండలి సభ్యులు తెలిపారు. ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మహాన్నదాన కార్యక్రమానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మండలి సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గణేష్ మండలి సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
