– రూ.10.02 కోట్ల ఆదాయం అంచనా
– అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచన
చేవెళ్ల మార్చి 14(ప్రజా జ్యోతి):
చేవెళ్ల మున్సిపాలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి బడ్జెట్ సమావేశం శనివారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై బడ్జెట్‌పై చర్చించారు. మున్సిపాలిటీకి వచ్చే ఏడాదికి పన్నుల రూపంలో రూ.10 కోట్ల 2 లక్షల 90 వేల ఆదాయం వచ్చేలా అంచనా వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మున్సిపల్ అభివృద్ధికి అధిక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని ప్రజలకు అవసరమైన పనులకే ఖర్చు చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో తాగునీటి సమస్య, పారిశుధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, మేనేజర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
