టీ20 వరల్డ్ కప్: భారత్‌పై ఓటమికి కారణాలు చెప్పిన యూఎస్ఏ కెప్టెన్

V. Sai Krishna Reddy
1 Min Read

టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ చేతిలో అమెరికా 29 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ స్పందించారు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ, టాప్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం, ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలే ఓటమికి కారణమని ఆయన విశ్లేషించాడు.

ఈ మ్యాచ్‌లో షాడ్లీ వాన్ షాల్క్‌విక్ (4/25) అద్భుత బౌలింగ్‌తో అమెరికా జట్టు భారత్‌ను కట్టడి చేసింది. ఒక దశలో టీమిండియా 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 89 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

మ్యాచ్ అనంతరం మోనాంక్ మాట్లాడుతూ.. “మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీలక సమయంలో మేము క్యాచ్‌లు వదిలేశాం. లేకపోతే భారత్‌ను 130 పరుగులకే కట్టడి చేసేవాళ్లం” అని అన్నారు.

162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్ఏకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మిలింద్ కుమార్ (34), సంజయ్ కృష్ణమూర్తి (37) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది. “ఈ వికెట్‌పై 160 పరుగులు ఛేదించగల స్కోరే. కానీ మా టాప్-3 బ్యాటర్లు సాఫ్ట్ డిస్మిసల్స్ అయ్యారు. ఈ ఓటమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. మరింత బలంగా పుంజుకుంటాం” అని మోనాంక్ పటేల్ ధీమా వ్యక్తం చేశాడు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *