తెలంగాణ వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. లైసెన్సులు దక్కించుకున్న కొత్త నిర్వాహకులు దుకాణాలను అందంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మకాలు మొదలుపెట్టారు. దీంతో తొలిరోజే చాలాచోట్ల దుకాణాల వద్ద సందడి వాతావరణం కనిపించింది, అమ్మకాలు జోరుగా సాగాయి.
ఈసారి కొత్త పాలసీలో భాగంగా హైదరాబాద్ సహా పలు జిల్లా కేంద్రాల్లో ‘వాకిన్ స్టోర్లను’ ఏర్పాటు చేశారు. వినియోగదారులు సూపర్ మార్కెట్ తరహాలో నేరుగా లోపలికి వెళ్లి తమకు నచ్చిన బ్రాండ్‌ను ఎంచుకునే సౌలభ్యం వీటిలో ఉంటుంది. లైసెన్సు ఫీజుకు అదనంగా రూ.5 లక్షలు చెల్లించిన వారికి ఈ అవకాశం కల్పించారు. నల్గొండలో కొత్తగా ఐదు వాకిన్ స్టోర్లు ఏర్పాటయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి సరుకు రవాణా జరగడంతో, మొదటి రోజే కొత్త స్టాక్‌తో అమ్మకాలు ప్రారంభించారు. ఈ నూతన విధానం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే, కొన్నిచోట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో దుకాణాలు ప్రారంభం కాలేదు. దేవాలయాలు, విద్యాసంస్థలు, నివాస ప్రాంతాలకు సమీపంలో దుకాణాలను ఏర్పాటు చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల సరైన దుకాణాలు అద్దెకు దొరకకపోవడం కూడా ప్రారంభం ఆలస్యం కావడానికి కారణమైంది. ఒక్క రంగారెడ్డి జిల్లా పరిధిలోనే సుమారు 25 దుకాణాలు తెరుచుకోలేదని, రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు
