పండగ సీజన్ ఆటోమొబైల్ రంగానికి భారీ ఊపునిచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా, నవరాత్రుల మొదటి రోజైన సోమవారం ఏకంగా 11,000 కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. గత ఐదేళ్లలో ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో కార్లు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ అద్భుతమైన అమ్మకాలపై హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) హోల్-టైమ్ డైరెక్టర్, సీఓఓ తరుణ్ గర్గ్ స్పందించారు. “నవరాత్రులు శుభప్రదంగా ప్రారంభం కావడం, దీనికి జీఎస్టీ 2.0 సంస్కరణల ఊపు తోడవడంతో మార్కెట్‌లో బలమైన సానుకూల వాతావరణం ఏర్పడింది. నవరాత్రుల తొలి రోజే హ్యూండాయ్ సుమారు 11,000 డీలర్ బిల్లింగ్‌లను నమోదు చేసింది. గత ఐదేళ్లలో ఒకే రోజులో మాకు ఇదే అత్యధిక పనితీరు” అని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో హ్యూండాయ్ సహా దాదాపు అన్ని ప్రధాన కార్ల తయారీ కంపెనీలు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు పూర్తిగా బదిలీ చేస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా, అమ్మకాలను మరింత పెంచుకునేందుకు అదనపు డిస్కౌంట్లు, ప్రత్యేక ఎడిషన్ వాహనాలను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి