తమ వివాహంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి, శ్రీ వర్షిణి దంపతులు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తమ జోలికి ఎవరైనా వస్తే లేదా విడదీయాలని ప్రయత్నిస్తే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని వారు సెల్ఫీ వీడియో ద్వారా సంచలన ప్రకటన చేశారు. తమను బలవంతంగా విడదీయాలని చూస్తే ఆత్మహత్యే శరణ్యమని వారు తేల్చిచెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ఇటీవల అఘోరి, శ్రీ వర్షిణిల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పెళ్లిపై తీవ్ర దుమారం రేగింది. వర్షిణి కుటుంబ సభ్యులు, కొందరు సాధువులు, అలాగే అఘోరి మొదటి భార్య… వీరి వివాహాన్ని వ్యతిరేకిస్తూ వరుసగా కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలతో వారిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఊపందుకుంది.
ఈ నేపథ్యంలోనే అఘోరి, వర్షిణి ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తమను అరెస్టు చేస్తారని వస్తున్న వార్తలపై వారు ఈ వీడియోలో స్పందించారు. జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నామని, తమ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. “మమ్మల్ని విడదీయాలని ఎవరు చూసినా…. మేమిద్దరం కలిసే ఆత్మహత్య చేసుకుంటాం… ఈ కారులోనే సజీవదహనం అయిపోతాం… కలిసి ప్రాణత్యాగం చేస్తాం” అని వారు ఆ వీడియోలో స్పష్టం చేశారు.
అంతేకాకుండా, తాము ఇకపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తిరిగి రాబోమని వారు ప్రకటించారు. శాశ్వతంగా కేదార్‌నాథ్ వెళ్లిపోతున్నామని, జీవితాంతం అక్కడే కలిసి ఉంటామని తెలిపారు. మా దారిన మేం పోతున్నాం మధ్యలో ఎవరూ అడ్డుకోవద్దని వారు విజ్ఞప్తి చేశారు.