కాంగ్రెస్ కి వైసీపీ మొదటి నుంచి దూరం. పైగా వైసీపీ ఏర్పాటు కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాకనే జగన్ ఏర్పాటు చేశారు. కాబట్టి కాంగ్రెస్ పట్ల వైసీపీకి ఆ దూర భావం ఎపుడూ ఉంది. ఇక బీజేపీ పట్ల మొదట్లో సానుకూలత ఉండేది అది అలా బలపడి 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచాక పరోక్ష బంధానికి దారి తీసింది. అది 2024 ఎన్నికల ముందు దాకా కొనసాగింది.
అయితే ఏపీలో వైసీపీ బద్ధ రాజకీయ ప్రత్యర్ధి అయిన టీడీపీతో బీజేపీ చేతులు కలపడంతో మెల్లగా వైసీపీకి విషయం బోధపడింది. ఇక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయింది. పది నెలలు గడచాయి. మెల్లగా వైసీపీ ఎండీయే పట్ల తన స్టాండ్ ని మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. బీజేపీ తాజాగా పార్లమెంట్ లో ఆమోదించుకున్న వక్ఫ్ సవరణ బిల్లు 2025 కి వ్యతిరేకంగానే వైసీపీ ఓటు చేసింది. ఎందుకంటే వైసీపీకి మైనారిటీ ఓటు బ్యాంక్ చాలా కీలకంగా ఉంది. మరో వైపు చూస్తే ఇపుడు మరో అడుగు ముందుకు వేసి మరీ వైసీపీ ఈ వక్ఫ్ చట్టం మీద సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఈ చట్టాన్ని సవాల్ చేసింది. నిజానికి ఈ పనిలో ఇండియా కూటమి పార్టీలు బిజీగా ఉన్నాయి. అలాగే ముస్లిం సంఘాలు కూడా ఉన్నాయి.
మోత! ఇపుడు ఏపీ నుంచి వైసీపీ ఈ చట్టం మీద వ్యతిరేకంగా అత్యున్నత న్యాయ స్థానం మెట్లు ఎక్కిన మొదటి పార్టీగా ఉంది. మరో వైపు చూస్తే ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్రం ఈ చట్టం తెచ్చిందని కూడా వైసీపీ తన పిటిషన్ లో పేర్కొనడం బట్టి చూస్తే కేంద్రం మీద డైరెక్ట్ ఫైట్ కే రెడీ అన్నట్లుగా ఉందని అంటున్నారు. అదే సమయంలో ముస్లిం మైనార్టీ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే ఎత్తుగడగా చూస్తున్నారు. ఇక రాజకీయంగా చూస్తే వైసీపీలో పునాది నుంచి ఉన్న వి విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారు అని ప్రచారం సాగుతోంది. ఆయన చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఇపుడు ఆయనను పార్టీలోకి తీసుకోవాలనుకోవడం వెనక బీజేపీ పెద్దల వ్యూహం ఉందని వైసీపీ అధినాయకత్వం అనుమానిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం కనుక అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే కనుక వైసీపీకి బీజేపీకి మరింత దూరం పెరుగుతుందని అంటున్నారు. మొత్తానికి టీడీపీకి బీజేపీ సహకారం అందిస్తోంది అన్నది వైసీపీ గ్రహిస్తోంది అని చెబుతున్నారు. దాంతో తన ఓటు బ్యాంక్ ని గట్టి చేసుకోవడమే కాకుండా తన రాజకీయ దారిని కూడా సరిగ్గా చూసుకోవాలని వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్డీయేకు వ్యతిరేకంగా రాజకీయం చేయడానికి వైసీపీ సిద్ధం అవుతోంది అని అంటున్నారు. మరి ఇది జాతీయ స్థాయిలో ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తుందో చూడాల్సి ఉంది.