సరిగ్గా మరో ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అనుకోని విధంగా వచ్చిన వక్ఫ్ చట్టం మీద ముస్లిం సమాజం మొత్తం మండిపోతోంది. పశ్చిమ బెంగాల్ లో ముస్లిం ల జనాభా మొత్తం పాపులేషన్ లో మూడవ వంతుగా ఉంది. దాంతో బెంగాల్ లో అనేక జిల్లాలు వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాయి. ఒక విధంగా చూస్తే బెంగాల్ లో ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. కేంద్రం చట్టం తెచ్చినా తమ రాష్త్రంలో అమలు చేయబోమని ఆమె ఖండితంగా చెప్పారు. పైగా రాష్ట్రంలో ప్రశాంతతను పాడు చేయవద్దని బిల్లుని చట్టాన్ని చేసిన వారి మీద పోరాటం చేయాలని ఆమె కోరారు.
అయితే వక్ఫ్ చట్టం మీద దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం ఆందోళలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా బెంగాల్ లో ఘర్షణలు ఎక్కడా ఆగడం లేదు. దాంతో పరిస్థితి అక్కడ చేయి దాటేలా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ముర్షిదాబాద్ సహా పలు సమస్యాత్మక ప్రాంతాలలో స్థానిక పోలీసులతో పాటు బీఎస్ఎఫ్ జవాన్లు కూడా పహరా కాస్తున్నారు.
ఇక బెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అనేక మందిని అరెస్టు చేస్తున్నారు. ముర్షిదాబాద్ లో జరుగుతున్న ఘర్షణలు కారణంగా లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలగడమే కాకుండా అనేక ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు విస్తృత నష్టం కలిగిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా వారాంతంలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో కనీసం ముగ్గురు మరణించారని నివేదికలు వెల్లడిస్తున్నాయి
వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించిన హింసాత్మక ఘర్షణల పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ముగ్గురు మరణించారని పోలీసులు చెబుతున్నరు. ఇక ముస్లింలు అధికంగా ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగిన హింసకు సంబంధించి 150 మందిని అరెస్టు చేశారు. మృతుల్లో ఇద్దరు ఘర్షణల్లో మరణించగా, ఒకరు కాల్పుల్లో మరణించారని లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ తెలిపారు. మరో వైపు చూస్తే జంగీపూర్‌లో కేంద్ర బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఆదేశించింది.
వెంటనే కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ నియంత్రణలో ఉందని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోం శాఖ కార్యదర్శికి వివరించారు. ఇంకో వైపు చూస్తే పశ్చిమ బెంగాల్ లో హిందువులకు రక్షణ లేదని బీజేపీకి చెందిన ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి సంచలన ప్రకటన చేశారు. బెంగాల్ లో పాలన సరిగ్గా లేదని లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెట్టకపోవడం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతకాని తనానికి నిదర్శనం అని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు మజాందార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇలా బెంగాల్ ఘర్షణలతో ఉన్న వేళ మమతా వర్సెస్ బీజేపీ అన్నట్లుగా అక్కడ రాజకీయం వేడెక్కుతోంది. మరి ఇది ఏ రకమైన పరిణామాలకు దారి తీస్తుంది అన్నది చూడాల్సి ఉంది.