ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో దారుణం జరిగింది. వ్యక్తిగత కక్షతో మామను దారుణంగా నరికి చంపిన అల్లుడు.. మొండెం నుంచి వేరు చేసిన మామ తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని కబీ దెహురీగా గుర్తించారు. మామపై దీర్ఘకాలంగా పెంచుకున్న ద్వేషంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. గ్రామస్థులు ‘దండా నాచా’ అనే సంప్రదాయ నృత్యాన్ని వీక్షిస్తున్న సమయంలో మామ హరిని నమ్మించి పొలాల్లోకి తీసుకెళ్లిన నిందితుడు అక్కడ గొడ్డలితో ఆయనను నరికి చంపాడు. ఆపై మొండెం నుంచి తలను వేరు చేసి దాని పట్టుకుని సౌకటి పోలీస్ అవుట్ పోస్టుకు వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించాడు. వెంటనే అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.