బెట్టింగ్… ఈ పేరు వింటేనే ఎంతోమంది జీవితాలు ఛిద్రమైన ఉదంతాలు గుర్తుకు వస్తాయి. క్షణికావేశంలో, సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఈ వ్యసనంలో కూరుకుపోయి, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఎన్నో. ముఖ్యంగా యువత దీని బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు.
లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సైతం కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనిపై స్పందించిన సజ్జనార్, బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కొందరు వినిపించుకోకపోవడంతో వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేశారు.
“చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల సులువుగా డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారు. గత కొద్ది నెలలుగా నేను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బెట్టింగ్ యాప్‌లపై పోస్టులు పెడుతున్నాను. వైజాగ్ సీపీ గారు కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసు పెట్టారు. ఎవరూ చట్టానికి అతీతులు కారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు. దీనివల్ల మీకున్న ఫాలోయింగ్ తగ్గిపోతుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్ యాప్‌లే కాదు, ఏ చట్టవిరుద్ధమైన, అనైతిక వ్యాపారాలను ప్రోత్సహించవద్దు” అని సజ్జనార్ హెచ్చరించారు.
అప్పులు చేసి బెట్టింగ్‌లలో పాల్గొని, ఆపై వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి గురించి ఆయన ప్రస్తావించారు. యువత బెట్టింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మాటలను నమ్మవద్దని కోరారు. ఎవరైనా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్‌లను నిషేధించేందుకు చట్టం తీసుకువస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్‌లు నిషేధించబడ్డాయి, కానీ ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌లో జరుగుతోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు