నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS).. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆస్పత్రి పేరు తెలియని వారుండరు.. నిత్యం పేషెంట్లతో రద్దీగా ఉండే నిమ్స్ ఆధునిక హంగులను సంతరించుకుంటోంది. హైదరాబాద్ , పంజాగుట్టలో ఏడో నిజాం కాలంలో నిమ్స్‌ను ఏర్పాటుచేశారు. అనంతర కాలంలో ఇది రాష్ట్రస్థాయి యూనివర్సిటీగా మారింది. నిమ్స్ ఆసుపత్రికి నిత్యం వేల మంది ఓపీ సేవలకోసం వస్తుంటారు. రోజుకు 2,500 నుంచి 3,000 మంది వరకు వస్తుంటారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కింద వేలాది మందికి ఉచితంగా చికిత్స అందిస్తుంటారు. అయితే తాజాగా తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్న 19 ఏళ్ళ యువకుడికి నిమ్స్ డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెత్ అయిన మరో యువకుడి గుండెను, ఈ 19 ఏండ్ల హైదరాబాద్ యువకుడికి విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేసి విజయం సాధించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించడంతో ప్రస్తుతం పేషెంట్ కోలుకుంటున్నాడు. కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌వోడీ, డాక్టర్ అమరేశ్ బాబు నేతృత్వంలోని డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ టెక్నీషియన్ల బృందం శుక్రవారం(మార్చి 7) శస్త్ర చికిత్సను పూర్తి చేసింది. గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్య బృందాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. అటు డోనర్ కుటుంబ సభ్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, అవయవదానంపై అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు.
హైదరాబాద్‌లోని రసూల్‌పురాకు చెందిన పూజారి అనిల్‌కుమార్ కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. నిమ్స్ హాస్పిటల్‌లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే, రోడ్డు ప్రమాదంలో గాయపడిన 24 ఏళ్ళ యువకుడు, హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం(మార్చి 7) బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఆ యువకుని బ్లడ్ గ్రూపునకు, అనిల్‌కుమార్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. దీంతో హార్ట్‌ను నిమ్స్‌కు తరలించి, డాక్టర్ అమరేశ్ బాబు నేతృత్వంలోని టీమ్ అనిల్‌కుమార్‌కు అమర్చింది.