పాకిస్థాన్ లో ఓ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేశారు. బలూచిస్తాన్ ను స్వతంత్ర ప్రాంతంగా గుర్తించాలన్న డిమాండ్ తో పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఈ దుశ్చర్యకు పాల్పడింది. వందలాంది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకుంది. ఈ క్రమంలో ఆరుగురు సైనికులను హతమార్చింది.
400 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న జఫ్పార్ ఎక్స్ ప్రెస్ రైలుపై బీఎల్ఎ మిలిటెంట్లు దాడి చేశారు. రైలులోని మొత్తం 9 బోగీలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు రైలును హైజాక్ చేసినట్టు బీఎల్ఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనకు తమదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది. పాక్ భద్రతా బలగాలు ఏవైనా చర్యలకు దిగితే బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది.
పాకిస్థాన్ లో బలూచిస్తాన్ విస్తీర్ణం పరంగా అతి పెద్ద రాష్ట్రంగా ఉంది. దేశంలోని 44 శాతం భూభాగం ఈ రాష్ట్ర పరిధిలోకే వస్తుంది. అయితే, దేశంలోనే అత్యంత తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఇదే. ప్రపంచంలోనే అత్యంత పొడవైన డీప్ సీ పోర్టుల్లో ఒకటైన గ్వాదర్ పోర్టు బలూచిస్తాన్ లోనే ఉంది.