భారత్ పై కూడా ప్రతీకార సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఇండియా, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని చెప్పారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సుంకాల గురించి ప్రస్తావించారు.
దశాబ్దాలుగా కొన్ని దేశాలు అమెరికాపై సుంకాలు విధిస్తున్నాయని… ఇప్పుడు తమ సమయం ఆసన్నమయిందని ట్రంప్ చెప్పారు. చైనా, బ్రెజిల్, ఇండియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు అమెరికా నుంచి అధిక సుంకాలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఇండియా తమపై 100 శాతానికి పైగా టారిఫ్ లు విధించిందని పేర్కొన్నారు. అమెరికాకు ఎక్కడా న్యాయం జరగలేదని తెలిపారు. అందుకే ఆయా దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు వసూలు చేస్తామని చెప్పారు. ఆయా దేశాలు ఎంత విధిస్తే తాము కూడా అంతే మొత్తంలో వసూలు చేస్తామని తెలిపారు. దీని వల్ల అమెరికా సంపన్నంగా మారుతుందని చెప్పారు.