నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటరు వద్ద జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకుపోగా, నేటికి 9వ రోజు కూడా వారి ఆచూకీ తెలియరాలేదు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సంఘటన స్థలానికి వచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోకి వెళ్లి సహాయక చర్యలు కొనసాగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం టన్నెల్ వద్ద అధికారులతో సమావేశం అయ్యారు. సహాయక చర్యలపై సమీక్ష చేపట్టారు. గత 9 రోజులుగా సహాయక చర్యలు జరుగుతున్న తీరును అధికారులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మృతదేహాలు బయటికి తీసుకువచ్చే వరకు పనులు ఆపొద్దని సూచించారు. రెస్క్యూ టీమ్ లకు అధికారులు అన్ని విధాలుగా సహకరించాలని నిర్దేశించారు. కాగా, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు.