పిల్ల‌ల‌ను అన్ని షోల‌కు అనుమ‌తించాలి: తెలంగాణ హైకోర్టు

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ‌లోని మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. 16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌ను అన్ని షోల‌కు అనుమ‌తించాల‌ని న్యాయ‌స్థానం స‌వ‌ర‌ణ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు జ‌న‌వ‌రి 21న ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను స‌వ‌రించింది. మ‌రోవైపు తెలంగాణ‌లో బెనిఫిట్‌, ప్రీమియ‌ర్, స్పెష‌ల్ షోల‌కు అనుమ‌తి నిరాక‌రించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను మార్చి 17కు వాయిదా వేసింది.

సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు, ప్రత్యేక షోల అనుమ‌తి వ్య‌వ‌హారంపై దాఖ‌లైన పిటిష‌న్ల విచార‌ణ స‌మ‌యంలో జ‌స్టిస్ బి. విజ‌య్ సేన్‌రెడ్డి ధ‌ర్మాస‌నం ఇటీవ‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. సెకండ్ షోల‌కు పిల్ల‌లు వెళ్ల‌డం ద్వారా వారి ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు.

న్యాయ‌వాది వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన కోర్టు… రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌ను థియేట‌ర్ల‌లోకి అనుమ‌తించొద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ విష‌య‌మై అన్ని వ‌ర్గాలతో చ‌ర్చించి త‌గు నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది.

ఈ క్ర‌మంలో మ‌ల్టీప్లెక్స్ యాజ‌మాన్యాలు హైకోర్టు ఉత్త‌ర్వుల‌పై మ‌ధ్యంత‌ర పిటిష‌న్ దాఖ‌లు చేశాయి. పిల్ల‌ల ప్ర‌వేశంపై ఆంక్ష‌ల కార‌ణంగా తాము ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నామ‌ని త‌మ పిటిష‌న్‌లో పేర్కొన్నాయి. దీనిపై రాష్ట్ర స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకునేవ‌ర‌కు హైకోర్టు ఆంక్ష‌ల‌ను ఎత్తివేయాల‌ని కోరాయి. తాజాగా ఈ పిటిష‌న్‌ను విచారించిన న్యాయ‌స్థానం గ‌త ఉత్త‌ర్వుల‌ను స‌వ‌రించి, 16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌ను అన్ని షోల‌కు అనుమ‌తించాల‌ని తెలిపింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *