చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. పటిష్ఠమైన ఇంగ్లండ్ జట్టుపై భారీ స్కోరు సాధించడమే కాకుండా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సంచలనం నమోదు చేసింది. ఆఫ్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (177) సాధించి, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి భారత దిగ్గజాల రికార్డులను బద్దలుగొట్టాడు.
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు సాధించింది. తొలుత 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించిన ఆఫ్ఘనిస్థాన్‌ను జద్రాన్ ఆదుకున్నాడు. క్రీజులో పాతుకుపోయి ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కెప్టెన్ హష్మతుల్లా (40)తో కలిసి నాలుగో వికెట్‌కు సెంచరీ (103) భాగస్వామ్యం నమోదు చేశాడు. ఆ తర్వాత మహ్మద్ నబీ (40)తో కలిసి ఆరో వికెట్‌కు 111 పరుగులు జోడించాడు. ఇక, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్న జద్రాన్ 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేసి చాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదే ట్రోఫీలో లాహోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బెన్ డకెట్ 165 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా, ఇప్పుడా రికార్డును జద్రాన్ తుడిచిపెట్టేశాడు. ఇక, 2004లో ది ఓవల్‌లో యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో నాథన్ ఆస్ట్లే అజేయంగా 145 పరుగులు చేయగా, 2002లో ఇండియాతో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో ఆండీ ఫ్లవర్ 145 పరుగులు చేశాడు. 2000వ సంవత్సరంలో నైరోబీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ అజేయంగా 141 పరుగులు చేయగా, 1998లో ఢాకాలో సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 141 పరుగులు, 2009లో సెంచూరియన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రేమ్ స్మిత్ 141 పరుగులు చేశాడు. ఇప్పుడీ మ్యాచ్‌లో జద్రాన్ ఏకంగా 177 పరుగులు చేసి అందరి రికార్డులను బద్దలుగొట్టి చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా అవతరించాడు. కాగా, 2023 ప్రపంచకప్‌లో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ను ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చేసింది. రేపు ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ అద్భుతం జరిగి ఆస్ట్రేలియాను ఓడిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది