కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు వరుసగా రెండో రోజు కూడా విచారించారు. తొలి రోజు పలు ప్రశ్నలకు తనకు తెలియదని, మర్చిపోయానని, గుర్తులేదని వంశీ సమాధానమిచ్చారు. దీంతో రెండో రోజు పోలీసు అధికారులు 12వ తేదీ నాటి కాల్ డేటాను ముందు పెట్టి కాస్తంత గట్టిగానే ప్రశ్నించడంతో వంశీ దిగొచ్చారు. 12వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు మీరు తాడేపల్లిలోనే ఉన్నట్టు మీ ఫోన్ లొకేషన్ చూపిస్తోందని చెప్పడంతో ఆ రోజు తాను జగన్‌ను కలిశానని వంశీ అంగీకరించారు. కిడ్నాప్ విషయాన్ని మాత్రం జగన్ వద్ద ప్రస్తావించలేదని చెప్పారు. అయితే, మిగతా ప్రశ్నలకు మాత్రం తనకు తెలియదని చెప్పినట్టు తెలిసింది.
మరోవైపు, నిన్న రెండో రోజు ఇదే కేసులో అరెస్ట్ అయిన శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని కూడా పోలీసులు విచారించారు. వంశీ ఆదేశాల మేరకు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశామని, హైదరాబాద్, విశాఖపట్నం తీసుకెళ్లామని వారు అంగీకరించినట్టు తెలిసింది. అంతేకాదు, కిడ్నాప్‌కు ప్లాన్ రచించింది వంశీయేనని యతీంద్ర రామకృష్ణ, యర్రంశెట్టి రామాంజనేయులు చెప్పారని పేర్కొన్నారు. ఈ నెల 10న సత్యవర్ధన్‌ను కోర్టు వద్ద రామాంజనేయులు, వేణు, వేల్పుల వంశీ కలిసి కిడ్నాప్ చేసి నలుపు రంగు కారులో హైదరాబాద్‌లోని వంశీ ఇంటికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఆ తర్వాత మళ్లీ వంశీ ఆదేశాలతో అదే కారులో సత్యవర్ధన్‌ను వైజాగ్ తీసుకెళ్లి తొలుత హోటల్‌లో తర్వాత ఓ ఫ్లాట్‌లో ఉంచినట్టు అంగీకరించారు. కాగా, కోర్టు ఆదేశాలతో వంశీని జైలులో వెస్ట్రన్ కమోడ్, పడుకునేందుకు దిమ్మ ఉన్న సెల్‌కు మార్చారు.