మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. బస్ స్టేషన్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న యువతితో మాటలు కలిపిన ఓ వ్యక్తి ఆపై ఆమెను ఖాళీగా ఉన్న బస్సులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రయాణికులతో రద్దీగా ఉండే స్వర్‌గేట్‌లో స్టేషన్‌లో నిన్న ఉదయం ఆరు గంటల సమయంలో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతి తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్‌లో వేచి చూస్తోంది. ఆమె ఒంటిగా ఉన్న విషయాన్ని గమనించిన నిందితుడు అక్కా అని సంబోధిస్తూ మాటలు కలిపాడు. ఆమె ఎక్కడికి వెళ్లేదీ తెలుసుకున్నాడు. ఆ గ్రామానికి వెళ్లే బస్సు ఇక్కడ ఆగదని, మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్‌లో దూరంగా నిలిపి ఉంచిన బస్ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం బస్సు ఎక్కాలని చెప్పగా, ఆమె అనుమానించింది. అది గమనించిన నిందితుడు బస్సులో ప్రయాణికులు ఉన్నారని, నిద్ర పోతుండటంతో లైట్లు ఆఫ్ చేశారంటూ బలవంతంగా ఆమెను బస్సు ఎక్కించాడు. ఆపై తలుపు వేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని దత్తాత్రేయ రామదాస్ (36)గా పోలీసులు గుర్తించారు. అతడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిలుపై ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.