ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడకు రాలేదని స్పష్టం చేశారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరగడంతో ఎనిమిది మంది అందులోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఓ వైపు ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల విమర్శలు విడ్డూరమని అన్నారు. టన్నెల్ వద్ద ఘటనాస్థలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాలేదంటూ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించడాన్ని మంత్రి తప్పుబట్టారు.
ఎస్ఎల్‌బీసీ ఘటన తీవ్ర విషాదకరమైనదని, ఈ ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం పనిచేయడానికి సిక్కిం, ఝార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ప్రాణాలతో బయటకు రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామని అన్నారు. వీరిని కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రంగంలోకి దిగిందని ఆయన తెలిపారు. ఎస్ఎల్‌బీసీ ఘటనపై రాజకీయ విమర్శలు చేస్తే, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. మంత్రులు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఎస్‌ఎల్‌బీసీ వద్ద రెస్క్యూ కొనసాగుతోందని, ఈ సహాయక చర్యలకు ఇబ్బందులు రావొద్దనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడకు రాలేదని తెలిపారు. కానీ కేటీఆర్ రాలేదని విమర్శలు చేయడం సరికాదని విమర్శించారు. సిరిసిల్లలో, కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రమాదం జరిగినప్పుడు కేటీఆర్ వెళ్లారా? అని ప్రశ్నించారు.