నకిలీ పురుగుమందుతో నిలువునా మునిగిన రైతు

Kamareddy
2 Min Read

నకిలీ పురుగుమందుతో నిలువునా మునిగిన రైతు..?

– చేతికందే దశలో మాడిపోయిన వరి పంట

— సమస్యకు స్పందించని వ్యవసాయ శాఖ ఏవో, ఏఈఓ

– జిల్లా వ్యవసాయాధికారి, కలెక్టర్ ను కోరిన బాధితులు

గాంధారి, మార్చి 15 (ప్రజాజ్యోతి)

నమ్మకంతో పిచికారీ చేసిన పురుగుమందే రైతు కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది. నానో యూరియాతో కలిపి స్ప్రే చేసిన పురుగుమందు ప్రభావంతో చేతికందే దశలో ఉన్న వరి పంట మొత్తం నిలువునా మాడిపోవడంతో బాధిత రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన గాంధారి మండలం గుర్జల్ తాండలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన రైతు బస్సి తాన్ సింగ్ నాయక్ మరియు రైతు దుర్గాబాయి తమకు ఉన్న 4 ఎకరాల 20 గుంటల పొలంలో వరి పంట సాగు చేశారు. పంటపై పురుగు ఆశించడంతో మార్కెట్‌లో లభించే ఒక ప్రముఖ కంపెనీ పురుగుమందుతో పాటు నానో యూరియా కలిపి పిచికారీ చేశారు. అయితే మందు ప్రభావంతో పంట కోలుకోవడం బదులు పూర్తిగా మాడిపోయింది. చేతికందే దశలో ఉన్న పంట ఒక్కసారిగా ఎండిపోవడంతో రైతు కుటుంబం తీవ్రంగా నష్టపోయింది.ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 12 వ తేదీ నుంచే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా, ఏఈఓ, ఏఓలు ఇప్పటివరకు క్షేత్రస్థాయికి రాలేదని వారు ఆరోపించారు. సోమవారం వస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని, ఈలోగా పంట మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే జిల్లా వ్యవసాయాధికారి (జేడీఏ), కంపెనీ ప్రతినిధులు మరియు డీలర్లు క్షేత్రస్థాయికి వచ్చి పంట నష్టాన్ని పరిశీలించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఒకవేళ పంట కోలుకునే పరిస్థితి లేకపోతే 4 ఎకరాల 20 గుంటల పొలానికి ఎకరాకు తగిన రీతిలో భారీ నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు.అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ స్వయంగా స్పందించి ఘటనపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.ఈ సందర్భంగా రైతు బస్సి తాన్ సింగ్ నాయక్ మాట్లాడుతూ,“నోటి దాకా వచ్చిన కూడు నకిలీ మందుల వల్ల నేలపాలైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి” అని డిమాండ్ చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *