సిద్దిపేట, మార్చి 13 ,(ప్రజాజ్యోతి): జిల్లాలో వంటగ్యాస్ సరఫరా సక్రమంగా కొనసాగుతోందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కె. హైమవతి తెలిపారు.శుక్రవారం ఆమె మాట్లాడుతూ జిల్లాలో 3,32,850 గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు, సుమారు 1,500 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. గతంలాగే ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంటగ్యాస్‌ను నిరంతరం సరఫరా చేస్తోందన్నారు.అనవసర భయంతో ఎక్కువ సిలిండర్లు బుక్ చేసుకోవద్దని, అలా చేయడం వల్లే సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని సూచించారు. కమర్షియల్ వంటగ్యాస్ కూడా అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
