నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ప్రాణం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు స్పందించే గుణమే మానవత్వమని నర్సాపూర్ స్థానికులు నిరూపించారు. పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో గురువారం ఉదయం ఒక మూగజీవికి ప్రాణాపాయం తప్పింది. ఒక వీధి కుక్క కార్యాలయ ప్రహరీ గోడ గేటు గుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, దాని తల గేటు ఇనుప ఊచల మధ్య ఇరుక్కుపోయింది. ముందుకు, వెనక్కి రాలేక ఆ శునకం విలవిలలాడుతూ కేకలు వేసింది. దీనిని గమనించిన స్థానికులు దానిని కాపాడేందుకు సుమారు 30 నిమిషాల పాటు ఎంతో ఓపికగా, చాకచక్యంగా శ్రమించారు. మొదట కుక్క తలను బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆందోళన నెలకొంది. పట్టుదలతో వివిధ రకాలుగా ప్రయత్నించి ఎట్టకేలకు ఆ మూగజీవి తలను సురక్షితంగా బయటకు తీశారు. విముక్తి పొందిన ఆ శునకం అక్కడి నుండి పరుగులు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు
.
