ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టు ద్వారా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 12 రోజుల కస్టడీ విచారణ పూర్తి కావడంతో, పోలీసు అధికారులు రవి నుంచి సేకరించిన ముఖ్యమైన సమాచారాన్ని కోర్టుకు సమర్పించారు. మూవీ పైరసీ కోసం ఐబొమ్మ రవి రెండు రకాలుగా కొనుగోలు చేసేవాడని, సాధారణ ప్రింట్‌కు 100 డాలర్లు, హెచ్‌డీ ప్రింట్‌కు 200 డాలర్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
రవికి సంబంధించి మొత్తం ఏడు బ్యాంకు ఖాతాలు ఉండగా, వాటిలో రూ.13.40 కోట్ల నగదు జమ అయినట్లు గుర్తించారు. బెట్టింగ్ యాడ్‌ల ద్వారా రూ.1.78 కోట్ల ఆదాయం సంపాదించినట్లు సమాచారం. అలాగే తన సోదరి చంద్రికకు రూ.90 లక్షల నగదు పంపినట్లు పోలీసులు గుర్తించారు. నగదు లావాదేవీలన్నీ రవి డాలర్ల రూపంలోనే చేశాడని పేర్కొన్నారు. రాకేశ్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్‌మార్క్ లైసెన్స్ పొందినట్లు గుర్తించారు.
బెట్టింగ్, పైరసీ ద్వారా వచ్చిన డబ్బుతో రవి విలాసవంతమైన జీవితం గడిపాడని పేర్కొన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో కార్యాలయాన్ని నిర్వహించాడని తెలిపారు. పైరసీ వ్యాపారం కోసం పది మందిని నియమించుకున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం రవి ఖాతాలో ఉన్న రూ.3 కోట్ల నగదును ఫ్రీజ్ చేసినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు పేర్కొన్నారు.
