తూప్రాన్ ప్రజాజ్యోతి జనవరి 1
నూతన సంవత్సర వేడుకల్లో భద్రతే ప్రధానం – తూప్రాన్ సిఐ రంగా కృష్ణ
నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ శాంతియుతంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని తూప్రాన్ సీఐ రంగా కృష్ణ తెలిపారు. వేడుకల పేరుతో చట్టాన్ని అతిక్రమించే చర్యలకు పాల్పడితే ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గ్రామాల్లో పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని, ప్రజలు తమ కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే రహదారులపై హంగామా, అసభ్య ప్రవర్తన, గుంపులుగా చేరి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. డీజే సౌండ్‌లు, పటాకుల వాడకం విషయంలోనూ చట్టపరమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అయన తెలిపారు. ప్రజల సహకారంతోనే నూతన సంవత్సర వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు
