వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమని, మరోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగితే వైసీపీ 200 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని, ఒకవేళ 175 సీట్లే ఉంటే గతంలో వచ్చిన 151 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటామని సజ్జల పేర్కొన్నారు. “జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు ముందుకు తీసుకెళ్లారు. ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించిన ఘనత ఆయనది. ప్రజలు తమ భవిష్యత్తు కోసం మళ్లీ జగన్ పాలననే కోరుకుంటున్నారు” అని సజ్జల వ్యాఖ్యానించారు.
జగన్ పుట్టినరోజు వేడుకల పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో వైసీపీ నాయకులు చేసిన హల్చల్ వివాదాస్పదమైంది. రక్తదాన శిబిరం పేరుతో ఆసుపత్రి ప్రాంగణంలో భారీ ఫ్లెక్సీలు కట్టి, ఈలలు, కేకలతో గోల చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై స్పందించిన పోలీసులు.. నియోజకవర్గ కన్వీనర్ స్వామిదాస్తో పాటు మరో 20 మందిపై కేసులు నమోదు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా భానుకోటలో వైసీపీ నాయకులు బర్త్డే వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించారు. వేట కొడవళ్లతో పొట్టేళ్ల తలలు నరికి, ఆ రక్తంతో జగన్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు అభిషేకం చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి ఘటనలే పునరావృతమయ్యాయి. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద రాజకీయ కార్యాలయాన్ని తలపించేలా జగన్ శుభాకాంక్షల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై విద్యార్థులు, మేధావుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
