దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో రైలు స్టేషన్ సమీపంలో ఒక కారులో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయని సమాచారం. ఎనిమిది కార్లు ధ్వంసమయ్యాయి. ఒక కారులో పేలుడు సంభవించగా, పక్కనే ఉన్న మిగిలిన కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పేలుడులో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గేట్ నెంబర్-1 సమీపంలో పార్కింగ్ చేసిన కారులో సాయంత్రం 6.45 నిమిషాలకు పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది.
ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రవాద చర్యనా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
