దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్లో వికెట్ కీపర్‌గా అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకున్న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రపంచ రికార్డును సమం చేశాడు. పాకిస్థాన్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు గాను డికాక్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.
రిటైర్మెంట్ తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన డికాక్, పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సత్తా చాటాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో మొత్తం 239 పరుగులు చేశాడు. సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచినందుకు అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది. ఇది డికాక్‌కు వన్డే కెరీర్లో ఏడో సిరీస్ అవార్డు కావడం విశేషం.
దీంతో వన్డేల్లో వికెట్ కీపర్‌గా అత్యధిక సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోనీతో కలిసి డికాక్ అగ్రస్థానంలో నిలిచాడు. ధోనీ తన 15 ఏళ్ల వన్డే కెరీర్లో (2004-2019) ఏడుసార్లు ఈ ఘనత సాధించాడు. వీరి తర్వాత బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ (6) రెండో స్థానంలో ఉన్నాడు.
ఇదే సిరీస్‌లో డికాక్ మరో కీలక మైలురాయిని కూడా చేరుకున్నాడు. వన్డేల్లో 7,000 పరుగుల మార్కును దాటేశాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. చివరి వన్డేలో డికాక్ 53 పరుగులు చేసినప్పటికీ, అతను ఔటయ్యాక దక్షిణాఫ్రికా జట్టు 143 పరుగులకే కుప్పకూలింది.
కాగా, వన్డే క్రికెట్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకున్న రికార్డు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (15) పేరిట ఉంది. విరాట్ కోహ్లీ, సనత్ జయసూర్య (11) సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
