తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆకాంక్షిస్తే, వారి కోరిక మేరకు తాను తప్పకుండా రాజకీయ పార్టీని స్థాపిస్తానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తాను చేపట్టనున్న ‘జాగృతి జనం బాట’ యాత్రకు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నిన్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ‘జాగృతి జనం బాట’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర నాలుగు నెలల పాటు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొనసాగుతుందని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు విద్యావంతులు, రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు, యువతతో సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటానని పేర్కొన్నారు. యాత్ర విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు.
మరోవైపు, రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా నియామకాలు చేపట్టడం వల్ల తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కు గురువారం లేఖ రాసినట్లు వెల్లడించారు.
అదేవిధంగా, విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్ (వీవోఏ)ల హక్కుల కోసం తాను పోరాడతానని కవిత భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద వీవోఏల సంఘం నిర్వహించిన మహాధర్నాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మద్దతు తెలిపారు. ఎన్నికల హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వీవోఏల వేతనాన్ని రూ.26 వేలకు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. వారి హక్కుల సాధన కోసం లాఠీ దెబ్బలు తినడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు.
