ఏపీలోని కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు వోల్వో బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.
సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వోల్వో బస్సు, కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉల్లిందకొండ సమీపంలో ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ దుర్ఘటనలో 20 మంది అగ్నికి ఆహుతయ్యారు. అప్రమత్తమైన సుమారు 19 మంది ప్రయాణికులు బస్సు అత్యవసర ద్వారం పగలగొట్టుకుని బయటపడటంతో స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఎక్స్ వేదికగా పేర్కొంది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్‌ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
