తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశంలోనే అత్యధికంగా అప్పుల భారంతో సతమతమవుతున్నారు. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ఒక సర్వేలో ఈ సంచలన విషయాలు వెలుగుచూశాయి. 2020-21 గణాంకాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, అప్పుల్లో కూరుకుపోయిన జనాభా విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానాన్ని ఆక్రమించింది.
ఈ సర్వే ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 43.7 శాతం మంది ప్రజలు అప్పులతో జీవిస్తున్నారు. ఇక తెలంగాణలో ఈ సంఖ్య 37.2 శాతంగా నమోదైంది. ఈ రెండు రాష్ట్రాలు దేశంలోనే తొలి రెండు స్థానాల్లో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బ్యాంకింగ్ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడిన వారిలో 92.3 శాతం మంది బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారు. కర్ణాటక (95.9%) మాత్రమే ఏపీ కన్నా ముందుంది. అయితే, కర్ణాటకలో కేవలం 23.2 శాతం మందే అప్పులపాలు కావడం గమనార్హం.
మరోవైపు, తెలంగాణలో బ్యాంకింగ్ సేవల విస్తరణ ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇక్కడ 86.5 శాతం మంది మాత్రమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉండగా, పెద్ద రాష్ట్రాల్లో ఈ విషయంలో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది.
ప్రాంతాల వారీగా చూస్తే, దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 31.8 శాతం మంది అప్పుల్లో ఉండగా, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంఖ్య కేవలం 7.4 శాతంగానే ఉంది. అక్కడ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 80.2 శాతంగా నమోదైంది. ఇక సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే, ఓబీసీలలో 16.6 శాతం మంది అప్పుల ఊబిలో చిక్కుకోగా, గిరిజనుల్లో ఈ భారం 11 శాతంతో తక్కువగా ఉంది. కుటుంబంలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నవారిపై అప్పుల భారం ఎక్కువగా ఉందని, సభ్యులు ఎక్కువగా ఉన్న కుటుంబాలపై భారం తక్కువగా ఉందని కూడా ఈ నివేదిక పేర్కొంది.