బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. పసిడి ప్రియులకు షాకిస్తూ, ఈ ధనత్రయోదశి నాటికి 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1.3 లక్షలకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, 2026 ఆరంభం నాటికి ఇది రూ.1.5 లక్షల మైలురాయిని కూడా దాటొచ్చని చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో డిసెంబర్ కాంట్రాక్టు 10 గ్రాముల బంగారం ధర 1.62 శాతం పెరిగి రూ.1,23,313 వద్దకు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం కూడా ధరలకు మద్దతునిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. వడ్డీ రేట్ల కోతల అంచనాల నేపథ్యంలో కరెన్సీలపై నమ్మకం తగ్గడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారని వారు వివరించారు. డాలర్ బలహీనపడటం కూడా ఇతర కరెన్సీలలో ఉన్న మదుపర్లకు బంగారం కొనుగోలును ఆకర్షణీయంగా మార్చింది.
మరోవైపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య సుంకాల విషయమై నెలకొన్న ఉద్రిక్తతలు కూడా పసిడి పెరుగుదలకు దోహదపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర శుక్రవారం ఔన్సుకు 4,060 డాలర్ల రికార్డు స్థాయిని దాటింది. బంగారంతో పాటే వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ వెండి ఫ్యూచర్స్ కిలోకు 3.44 శాతం పెరిగి రూ.1,51,577కు చేరింది