మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి కన్నుమూత‌

V. Sai Krishna Reddy
2 Min Read

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వారం క్రితం ఆరోగ్యం విషమించడంతో ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు.

ఆయన అంత్యక్రియలు ఈ నెల 4న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అంతకంటే ముందు, శుక్రవారం (అక్టోబర్ 3న) ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసానికి, సాయంత్రానికి ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం సూర్యాపేటకు తరలించనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
దామోదర్‌రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

దామోదర్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటు: కాంగ్రెస్ నేతలు
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు కూడా తమ సంతాపం ప్రకటించారు. దామోదర్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ నేతలు అన్నారు.

దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కలిగి ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు ఐదుసార్లు పోటీ చేసి.. నాలుగుసార్లు గెలిచారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. 1988, 1989లలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించినప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం ఆయన రాజకీయ పట్టుకు నిదర్శనం.

1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2004లో టీడీపీ అభ్యర్థిపై మళ్లీ గెలిచారు. ఆ తర్వాత 2009లో సూర్యాపేట నుంచి గెలిచి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దామోదర్ రెడ్డి 2014, 2018, 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరామసాగర్‌ జలాలను తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *