మహారాష్ట్రలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఒక పికప్ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడటంతో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో చిన్నారులతో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. పుణె జిల్లాలోని ఖేడ్ తాలూకా పరిధిలో ఉన్న పాపల్‌వాడి గ్రామానికి చెందిన పలువురు భక్తులు కుందేశ్వర్ శివాలయంలో దర్శనం కోసం పికప్ ట్రక్కులో బయలుదేరారు. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా పడింది. అనంతరం దాదాపు 25 నుంచి 30 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళా భక్తులు దుర్మరణం పాలయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల బృందాలు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను పైత్‌లోని గ్రామీణ ఆసుపత్రితో పాటు సమీపంలోని ఇతర వైద్యశాలలకు తరలించాయి. ఈ ప్రమాదంలో సుమారు 25 నుంచి 35 మంది వరకు గాయపడినట్లు పింప్రి-చించ్‌వాడ్ డీసీపీ శివాజీ పవార్ తెలిపారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వివరించారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటన
పుణె ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై ఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.