తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు.