తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తువేల్ కరుణానిధి ముత్తు (ఎంకే ముత్తు) అనారోగ్యంతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తు ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈయన 1948 జనవరి 14న కరుణానిధి-పద్మావతి దంపతులకు జన్మించారు.
తన తండ్రి కళాభిరుచి లాగే ఎం.కె.ముత్తు కూడా తొలుత నాటకాల్లో, తరువాత సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఇదే సమయంలో 70వ దశకంలో డీఎంకే వేదికలపై పార్టీ విధానాలను వివరిస్తూ పాటలు పాడటం ద్వారా ప్రజల్లో ఎంతో ఆదరణ పొందారు.
ఆయన నటించిన చిత్రాలలో ‘పిళ్ళైయో పిళ్ళై’, ‘పూకారి’, ‘షయాలికారన్’, ‘దమయ విల్లుక్కు’ ప్రేక్షకులను అలరించాయి. ఆయన డీఎంకే వేదికలపైనే కాకుండా పలు సినిమాల్లో కూడా పాటలు పాడారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నయ్య ఆయన మరణం తర్వాత డీఎంకే ఇవాళ జరగాల్సిన అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. ఆయన భౌతికకాయాన్ని గోపాలపురంలోని తన తండ్రి కరుణానిధి నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు.
సీఎం స్టాలిన్ తన అన్నయ్యకు స్వయంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. “మా కుటుంబానికి మూలస్తంభం కలైంగర్ పెద్ద కుమారుడు, నా ప్రియమైన అన్నయ్య ఎంకే ముత్తు మరణ వార్త నన్ను బాధించింది. ఆయన మా తల్లిదండ్రుల మాదిరిగానే నన్ను ప్రేమించారు. నా హృదయానికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని కోల్పోవడం నాకు చాలా బాధ ఉంది” అని సీఎం స్టాలిన్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) పోస్టులో పేర్కొన్నారు. కరుణానిధి తమ తాత ముత్తువీరన్ పేరు మీద ముత్తు అని పేరు పెట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.