రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
శనివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
అలాగే, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
వర్షాల కారణంగా ఏర్పడే వరదలు, జలమయ ప్రాంతాల్లో ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ అధికారులు సూచించారు.