విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ (వెంకట్ రాజ్) అనారోగ్యంతో కన్నుమూశారు. నేడు (జులై 18) హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఫిష్ వెంకట్ వయసు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి ఇటీవల విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అయినప్పటికీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.
ఫిష్ వెంకట్ తెలంగాణ యాసలో మాట్లాడే ప్రత్యేక శైలి, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లో జన్మించిన ఆయన 2000వ దశకంలో ‘ఖుషి’సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆది, బన్నీ, అదుర్స్, గబ్బర్ సింగ్, డీజే టిల్లు వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను అలరించింది. కామెడీ పాత్రలతో పాటు, విలన్ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన కొంతకాలం కిందట నటించిన ‘స్లమ్ డాగ్ హస్బెండ్’, ‘నరకాసుర’, ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
గత తొమ్మిది నెలలుగా కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్‌కు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సుమారు రూ. 50 లక్షల ఖర్చు అవుతుందని, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం సహాయం కోరినట్లు ఆయన కుమార్తె స్రవంతి వెల్లడించారు. కొందరు ఆర్థిక సహాయం అందించినప్పటికీ, తగిన కిడ్నీ దాత కనిపించకపోవడం ప్రధాన సమస్యగా మారినట్టు వార్తలు వచ్చాయి.
ఫిష్ వెంకట్ భార్య సువర్ణ, కుమార్తె స్రవంతితో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ, సోషల్ మీడియా వేదికలపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.