గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలో మహీసాగర్ నదిపై నిర్మించిన వంతెన బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో వంతెనపై ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు, ఒక ట్యాంకర్ అదుపుతప్పి నేరుగా నదిలో పడిపోయాయి.
ఈ వంతెన ఆనంద్, వడోదర నగరాలను కలుపుతూ కీలక రవాణా మార్గంగా ఉంది. బ్రిడ్జి కూలిపోవడంతో ఈ రెండు నగరాల మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా, ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యల కోసం బృందాలు ఘటనా స్థలానికి బయలుదేరినట్టు తెలుస్తోంది. అయితే, నదిలో పడిపోయిన వాహనాల్లోని సిబ్బంది పరిస్థితి ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వంతెన కూలిపోవడానికి గల కారణాలపై కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.