టెక్ రంగంలో కల్లోలం.. ఈ ఏడాది లక్ష దాటిన ఉద్యోగాల కోత!

V. Sai Krishna Reddy
2 Min Read

టెక్నాలజీ రంగంలో ఉద్యోగులకు 2025 సంవత్సరం గడ్డుకాలంగా మారింది. ఖర్చుల తగ్గింపు, కంపెనీల పునర్‌వ్యవస్థీకరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యాప్తి వంటి కారణాలతో ఈ ఏడాది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా టెక్ ఉద్యోగాలకు కోత పడింది. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు సైతం వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ ప్రకటనలు చేయడం ఆందోళన కలిగిస్తోంది.

దిగ్గజ కంపెనీలలో భారీ కోతలు
తాజాగా మైక్రోసాఫ్ట్ తన గేమింగ్, ఎక్స్‌బాక్స్ విభాగాలపై దృష్టి సారించి ఏకంగా 9,100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. వ్యూహాత్మక వృద్ధిపై దృష్టి పెట్టేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఎక్స్‌బాక్స్ హెడ్ ఫిల్ స్పెన్సర్ తెలిపారు. మరోవైపు, చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం వరకు కోత విధించేందుకు సిద్ధమవుతోంది. సమర్థతను పెంచి, చిన్న బృందాలతో వేగంగా పనిచేయడమే తమ లక్ష్యమని కంపెనీ నూతన సీఈవో లిప్-బు టాన్ పేర్కొన్నారు.

అమెజాన్, గూగుల్, మెటా వంటి ఇతర అగ్రశ్రేణి కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. అమెజాన్ తన బుక్స్, కిండిల్ విభాగాలతో పాటు పలు ఇతర టీమ్‌లలోనూ ఉద్యోగులను తగ్గించింది. గూగుల్ కూడా తన ఆండ్రాయిడ్, పిక్సెల్ విభాగాల్లో వందలాది మందిని తొలగించింది. మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగంలో ఏఐని ప్రవేశపెట్టిన ఐబీఎం, దాదాపు 8,000 ఉద్యోగాలను రద్దు చేసినట్టు సమాచారం.

ఇన్ఫోసిస్‌లోనూ అదే పరిస్థితి
భారత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా అంతర్గత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన 240 మంది ఎంట్రీ-లెవల్ ఉద్యోగులను తొలగించింది. కొన్ని నెలల క్రితం కూడా ఇదే కారణంతో 300 మంది ఫ్రెషర్లను తొలగించడం గమనార్హం. వీరిలో చాలామంది రెండేళ్లకు పైగా నిరీక్షించి 2024 చివర్లో ఉద్యోగంలో చేరినవారే కావడం గమనార్హం.

ఏఐ ప్రభావమే కారణమా?
టెక్ కంపెనీలు ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ, మరోవైపు ఏఐ సంబంధిత నైపుణ్యాలు ఉన్నవారికి పెద్దపీట వేస్తున్నాయి. చాలా కంపెనీలు ఏఐ, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా తమ కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించుకుంటున్నాయి. దీంతో సాధారణ ఉద్యోగాలకు గండిపడుతోందని, ఏఐ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక ఒత్తిళ్లు, బలహీనమైన వినియోగదారుల డిమాండ్ కూడా ఈ లేఆఫ్స్‌కు ఆజ్యం పోస్తున్నాయి. సేల్స్‌ఫోర్స్, హెచ్‌పీ, టిక్‌టాక్, ఓలా ఎలక్ట్రిక్ వంటి అనేక ఇతర కంపెనీలు కూడా ఉద్యోగాల కోతను ప్రకటించడంతో టెక్ రంగ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *