ప్రపంచంలోనే అత్యంత పలుచనైన ఫోల్డబుల్ ఫోన్‌ను ఒప్పో లాంచ్ చేసింది. దీనిపేరు ‘ఒప్పో ఫైండ్ ఎన్5’. దీని మందం (ముడిచినప్పుడు) 8.93 మిల్లీమీటర్లు మాత్రమే. 2024లో విడుదలై అత్యంత పలుచనైన ఫోన్‌గా పేరుగాంచిన ‘ఆనర్ మేజిక్ వీ3’ కంటే కూడా ఇది సన్నగా ఉంటుంది. ఫోన్‌ను తెరిస్తే దాని అత్యంత పలుచనైన పాయింట్ వద్ద 4.21 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. దీంతో ప్రపంచంలోనే తమ ఫోన్ అత్యంత పలుచనైనదని ప్రకటించింది. కంపెనీ ఈ ఫోన్‌ను మూసివేసినప్పుడు ఉండే కొలతల ఆధారంగానే తమ ఫోన్ పలుచనిదని పేర్కొంది. ఒకవేళ ఫోన్‌ను తెరిచినప్పుడు ఉండే కొలతల ఆధారంగానైతే గతవారం విడుదలైన ‘హువావే మేట్ ఎక్స్‌టీ ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్’ అత్యంత సన్నగా ఉన్న ఫోన్ అవుతుంది. ఎందుకంటే దాని మందం 3.6 మిల్లీమీటర్లు మాత్రమే.
ఒప్పో ఫైండ్ ఎన్5’ను గురువారం లాంచ్ చేశారు. అన్ని యూరోపియన్, ఆసియా మార్కెట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఒప్పో తన ‘ఫైండ్ ఎన్’ సిరీస్‌ను ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేయలేదు కాబట్టి, తాజా ఫోన్ ఇక్కడ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై స్పష్టత లేదు. కాగా, ‘ఒప్పో ఫైండ్ ఎన్5’ ధర దాదాపు 1.62 లక్షలు ఉండే అవకాశం ఉంది