బలం ఇంజెక్షన్ పేరుతో గడ్డిమందు.. ప్రియురాలిని దారుణంగా చంపిన ఆర్ఎంపీ

V. Sai Krishna Reddy
2 Min Read

నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం బెడిసికొట్టడంతో మహిళను ఓ ఆర్ఎంపీ దారుణంగా హత్య చేశాడు. బలం ఇంజెక్షన్ పేరుతో గడ్డి మందు ఎక్కించి, అత్యాచారానికి పాల్పడి ఆమె ప్రాణాలు తీశాడు. ఈ అమానుష ఘటన గుర్రంపోడు మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకోగా, సోమవారం ఉదయం బాధితురాలు ఆసుపత్రిలో మృతిచెందింది.

పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాలగూడలో భర్త, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్న మహిళ.. గుర్రంపోడు మండలం జూనూతల గ్రామంలో ఉంటున్న అత్తగారికి సేవ చేసేందుకు తరచూ వచ్చి వెళ్తుండేది. ఆరు నెలల క్రితం ఆమె అత్త కాలు విరగడంతో, ఆమెకు వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ మహేశ్‌తో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కామళ్ల గ్రామానికి చెందిన మహేశ్‌కు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి పరిచయం కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, ఇటీవల వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని మహేశ్ నిర్ణయించుకున్నాడు.

పథకం ప్రకారమే ఘాతుకం
ఆదివారం సాయంత్రం అత్తగారి వద్దకు వెళ్లేందుకు మిర్యాలగూడ నుంచి బయలుదేరిన బాధితురాలు రాత్రి 9 గంటల సమయంలో కొండమల్లేపల్లి చేరుకుంది. సమయం మించిపోవడంతో ఆర్ఎంపీ మహేశ్ కారులో వెళ్తానని భర్తకు ఫోన్‌లో తెలిపింది. ఆమె ఫోన్ చేయగానే మహేశ్ తన కారులో అక్కడికి చేరుకున్నాడు. ఆమెను కారులో ఎక్కించుకున్న నిందితుడు గ్రామానికి వెళ్లే దారిలో కాకుండా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ బలం ఇంజెక్షన్ చేస్తున్నానని చెప్పి, ఆమె రెండు చేతులకు గడ్డి మందు ఇంజెక్ట్ చేశాడు. అనంతరం అదే విషాన్ని ఆమెతో బలవంతంగా తాగించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు.

గస్తీ పోలీసుల రాకతో నిందితుడి పరార్
బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమె చనిపోయిందని భావించిన మహేశ్ మృతదేహాన్ని పడేసేందుకు కారులో గుర్రంపోడు మండలం కాచారం వైపు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారును రోడ్డు పక్కన ఆపి ఉంచగా, అదే సమయంలో హైవే గస్తీ పోలీసులు అటుగా వచ్చారు. పోలీసు వాహనాన్ని చూసిన మహేశ్ కారును అక్కడే వదిలి పరారయ్యాడు. అనుమానంతో కారును తనిఖీ చేసిన పోలీసులు, అందులో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను గుర్తించి వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ కాస్త స్పృహలోకి వచ్చిన బాధితురాలు, తనకు జరిగిన ఘోరాన్ని వైద్యులకు వివరించింది. ఆమె పరిస్థితి విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది.

మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు తన భార్య ఫోన్ చేసిందని, ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *